The cyclonic storm TITLI  caused heavy damages in the North Coastal area of Srikakulam District. Road Services have been badly affected and power supply and telephone lines got disrupted. Uddhanam and sea-bed villages are most affected.

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. గత గురువారం ఉదయం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు-పల్లిసారథి వద్ద తిత్లీ తుఫాన్ తీరం దాటింది. ఈ సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోయి, కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉద్దానంతో పాటు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పలాస, గార, వజ్రపుకొత్తూరు, సోంపేటలో అతి భారీ వర్షాలు పడ్డాయి.

గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని ఊహించి ముందుగానే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద పార్కింగ్ చేసిన లారీలు పడిపోయాయి. రోడ్డుపై ఏమీ కనిపించకపోవడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీనివల్ల ప్రాణనష్టాన్ని అడ్డుకోగలిగింది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలోనే ఉందని అధికారులు అంటున్నారు.

జరిగిన చాలా నష్టానికి ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలని, నష్ట పొయిన ప్రజలు కోరుకుంటున్నారు.